బెంగళూరులో స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ..
ముంబై–అహ్మదాబాద్ కారిడార్ కోసం 8 బోగీల రైలు
అత్యాధునిక సౌకర్యాలు, భద్రతకు పెద్దపీట
(న్యూస్ఇన్,హైదరాబాద్)
భారత రైల్వే రంగంలో మరో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమవుతోంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న తొలి బుల్లెట్ రైలు తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం కర్ణాటక రాజధాని బెంగళూరులోని బీఈఎంఎల్ (BEML) కర్మాగారంలో ఈ రైలును నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికుల భద్రత, సౌకర్యాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ రైలు భారతీయ రైల్వే వ్యవస్థలో కీలక మైలురాయిగా నిలవనుంది.
గంటకు 280 కిలోమీటర్ల గరిష్ఠ పరీక్ష వేగం….
స్వదేశీ బుల్లెట్ రైలును గంటకు గరిష్ఠంగా 280 కిలోమీటర్ల పరీక్ష వేగాన్ని తట్టుకునేలా రూపొందిస్తున్నారు. ప్రయాణికుల సేవల్లో మాత్రం గంటకు 249 కిలోమీటర్ల వేగంతో నడిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 202 మీటర్ల పొడవుండే ఈ రైలులో మొత్తం ఎనిమిది బోగీలు ఉంటాయి. వీటిలో నాలుగు మోటార్ కోచ్‌లు, మరో నాలుగు ట్రైలర్ కోచ్‌లు ఉండనున్నాయి.ఒకేసారి సుమారు 557 మంది ప్రయాణించే సామర్థ్యంతో రైలును అభివృద్ధి చేస్తున్నారు. ఏడు స్టాండర్డ్ క్లాస్ బోగీల్లో 3×2 సీటింగ్ విధానం, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలో 2×2 సీటింగ్ సదుపాయం ఉంటుంది. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి ఎనిమిది బోగీల రెండు రైళ్లను అనుసంధానించి 16 బోగీల రైలుగా నడిపే అవకాశం కూడా కల్పిస్తున్నారు.

ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం….
భారతీయ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోగీల లోపలి భాగాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. కాళ్లు సౌకర్యంగా పెట్టుకునేందుకు తగినంత స్థలం, అధునాతన సీట్లు, ఎల్ఈడీ లైటింగ్, విశాలమైన కిటికీలు ఏర్పాటు చేయనున్నారు.చిన్న బ్యాగుల కోసం సీట్లకు పైన లగేజీ ర్యాక్‌లు, పెద్ద సూట్‌కేసుల కోసం ప్రత్యేక స్టాండ్లు అందుబాటులో ఉంటాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఛార్జింగ్ చేసుకునేందుకు విద్యుత్ సాకెట్లు ఏర్పాటు చేస్తారు. వ్యర్థాలను శుద్ధి చేసే బయో డైజెస్టర్ మరుగుదొడ్లు మరో ప్రత్యేకత.ఒక బోగీ నుంచి మరో బోగీలోకి ప్రయాణికులు సులభంగా వెళ్లేందుకు మూసివున్న అనుసంధాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మూడు భాషల్లో ప్రయాణ సమాచారం…
ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రతి బోగీలో ఎల్సీడీ డిస్ప్లేలు ఏర్పాటు చేయనున్నారు. ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో రైలు ప్రయాణ వివరాలు తెలుసుకోవచ్చు.
ఆటోమేటిక్ ప్రకటనల వ్యవస్థ ద్వారా స్టేషన్లు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని వినిపిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో రైలు సిబ్బందితో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులో ఉంటాయి.వైఫై ఆధారిత ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ ద్వారా ముందుగానే అందుబాటులో ఉంచిన వినోద కార్యక్రమాలను ప్రయాణికులు వీక్షించవచ్చు.

దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు….
దివ్యాంగులు, కదలికల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులు సులభంగా ఎక్కి దిగేలా రైలును రూపొందిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ ఎత్తుకు సమానంగా రైలు ఫ్లోర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఖాళీని తగ్గించేందుకు డోర్ల వద్ద ప్రత్యేకంగా ముందుకు వచ్చే మెట్లను ఏర్పాటు చేస్తున్నారు.
వీల్చైర్లు సులభంగా వెళ్లేలా విశాలమైన ద్వారాలు, ప్రత్యేక సీట్లు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి. దృష్టిలోపం ఉన్నవారి కోసం బ్రెయిలీ లిపిలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. రెండు ప్రత్యేక స్థలాలను దివ్యాంగులు, పరిమిత చలన సామర్థ్యం ఉన్న ప్రయాణికుల కోసం కేటాయిస్తున్నారు.
అధునాతన సాంకేతికత….
అత్యధిక వేగంతో ప్రయాణించే సమయంలో శబ్దం, కుదుపులు తగ్గించేలా రైలు బాడీ, ఫ్లోర్ నిర్మాణంలో ప్రత్యేక ఇన్సులేషన్ ఉపయోగిస్తున్నారు. శబ్దాన్ని తగ్గించే పూతలు, బోగీల కింది భాగంలో ప్రత్యేక కవర్లు, గాలి ప్రవాహాన్ని నియంత్రించే ఆకృతులు ఏర్పాటు చేస్తున్నారు.రైలు ముందుభాగాన్ని గాలి నిరోధకత తగ్గేలా ప్రత్యేకంగా రూపొందించారు. కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (CFD) సాంకేతికతతో గాలి ప్రవాహాన్ని విశ్లేషించి డిజైన్‌ను అభివృద్ధి చేశారు. దీనివల్ల సొరంగాల్లో ప్రయాణించే సమయంలో ఏర్పడే ఒత్తిడి తరంగాలు, శబ్దం, గాలి అడ్డంకులను తగ్గించవచ్చని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.
విద్యుత్ ఆదా చేసే బ్రేకింగ్ వ్యవస్థ…..
ఈ బుల్లెట్ రైలు 25 కిలోవోల్టుల, 50 హెర్ట్జ్ సింగిల్ ఫేజ్ ఏసీ విద్యుత్ సరఫరాతో పనిచేస్తుంది. రైలు వేగాన్ని తగ్గించే సమయంలో విడుదలయ్యే శక్తిలో కొంత భాగాన్ని తిరిగి విద్యుత్‌గా మార్చే రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుంది.ప్రతి బోగీలో రెండు చొప్పున ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు ఉంటాయి. బయట వాతావరణం ఎలా ఉన్నా బోగీల్లో ఉష్ణోగ్రత, తేమ ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
భద్రత కోసం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ….

రైలుకు రెండు చివరల్లో డ్రైవర్ క్యాబిన్లు ఉంటాయి. వీటిలో ఇంటెలిజెంట్ ఆన్‌బోర్డ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రైలు నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలను వేగంగా తీసుకోవడంతోపాటు ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
స్వదేశీ రైల్వే సాంకేతికతలో మరో అడుగు…..
ముంబై–అహ్మదాబాద్ మధ్య సుమారు 508 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా తయారవుతున్న బుల్లెట్ రైలు భారత ఇంజినీరింగ్ సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది.అత్యధిక వేగం, అధునాతన భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ రైలును అభివృద్ధి చేస్తున్నారు. తయారీ, పరీక్షలు పూర్తయిన అనంతరం రైల్వే అనుమతులకు అనుగుణంగా ప్రయాణికుల సేవల్లో ప్రవేశపెట్టనున్నారు.