NewsInn

News in a Click

హైదరాబాద్‌లో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమ దందా.. అండాల విక్రయాలపై పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌లో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమ దందా.. అండాల విక్రయాలపై పోలీసుల దర్యాప్తు

యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణలు

అండాలను సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు అనుమానాలు

(న్యూస్ఇన్,హైదరాబాద్)

గర్ల్స్ హాస్టల్ ముసుగులో వ్యభిచారంతో పాటు యువతుల అండాల అక్రమ సేకరణ, విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. బేగంపేట పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో ఉన్న ఓ గర్ల్స్ హాస్టల్‌లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించడంతో పాటు వారి అండాలను సేకరించి సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నారనే అనుమానాలపై దర్యాప్తు చేపట్టారు.

తెల్లవారుజామున పోలీసుల దాడులు….

Police ride

ప్రకాశ్‌నగర్‌లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్‌’లో గత ఏడాది కాలంగా అక్రమ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున బేగంపేట పోలీసులు, ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు పది మంది యువతులను గుర్తించారు. నలుగురు యువతులను అదుపులోకి తీసుకోగా, మరో పది మందిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. హాస్టల్ నిర్వాహకుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు.

ఫెర్టిలిటీ సెంటర్లకు అండాల సరఫరా?

Fertility problem

హాస్టల్‌లో ఉంటున్న యువతుల నుంచి అండాలను సేకరించి సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు దృష్టి సారించారు. అండాల సేకరణ, విక్రయాల వెనుక ఎవరున్నారు? ఏయే ఫెర్టిలిటీ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారంలో వైద్య సిబ్బంది ప్రమేయం ఉందా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ నెట్‌వర్క్‌లో ఓ మహిళ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పురుషుల వీర్యకణాల సరఫరాతోనూ ఈ వ్యవహారానికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

యువతులపై ఆరా….

Girls hostel

ఇతర రాష్ట్రాల నుంచి యువతులను ఏ పరిస్థితుల్లో తీసుకువచ్చారు? వారిని హాస్టల్‌లో ఎలా ఉంచారు? అండాల సేకరణకు వారి సమ్మతి ఉందా? వైద్యపరమైన నిబంధనలు పాటించారా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గర్ల్స్ హాస్టల్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపైనా విచారణ చేపట్టారు. అయితే అండాల అక్రమ విక్రయాలు, వ్యభిచారం ఆరోపణలకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న వ్యక్తులు, సంతాన సాఫల్య కేంద్రాల పాత్రపై స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *