(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, ప్రతి పెట్టుబడికి తాను భరోసాగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సన్నాహక కార్యక్రమాన్ని గురువారం రాత్రి ఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా ఉందని సీఎం తెలిపారు. 2034 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అప్పటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను ప్రస్తుత 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు వివరించారు.

పెట్టుబడిదారులకు ప్రభుత్వ భరోసా
పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులు, వ్యాపార వృద్ధి, లాభాల లక్ష్యాలను రెట్టింపు చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. వారి వ్యాపార విస్తరణకు అవసరమైన విధానపరమైన మార్పులు, ప్రభుత్వ సహకారం అందించేందుకు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానన్నారు. పారిశ్రామికవేత్తల సూచనలను స్వీకరించి, అడ్డంకులను తొలగించడమే ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరం
హైదరాబాద్‌కు నాలుగు వందల ఏళ్ల క్రితమే అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా గుర్తింపు ఉందని సీఎం గుర్తుచేశారు. చార్మినార్ పరిసరాల్లో ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, నఖాసీ వస్తువుల వ్యాపారం జరిగేదన్నారు. సత్య నాదెళ్ల, అజయ్ బంగా, శంతను నారాయణ్ వంటి ప్రపంచస్థాయి ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారని ప్రస్తావించారు. హైదరాబాద్ పోటీ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి ప్రపంచ నగరాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కేంద్రంతో సమన్వయంతో అభివృద్ధి
రాజీవ్‌గాంధీ కంప్యూటర్, టెలికం రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పీవీ నరసింహారావు అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి పునాది వేశాయని సీఎం పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె హైస్పీడ్ రైలు కారిడార్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ వంటి అంశాల్లో కేంద్ర సహకారాన్ని ప్రస్తావించారు.












Leave a Reply