NewsInn

News in a Click

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం సాధ్యమే: పీయూష్ గోయల్

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం సాధ్యమే: పీయూష్ గోయల్

(న్యూస్ఇన్, న్యూఢిల్లీ)

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సమష్టి కృషితో సాధించవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో తెలంగాణకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పెట్టుబడులకు అనుకూల వాతావరణం

పెట్టుబడిదారులు ప్రధానంగా విధానాల్లో స్థిరత్వం, నిబంధనల్లో స్పష్టత, వ్యాపార నిర్వహణలో పారదర్శకతను కోరుకుంటారని గోయల్ వివరించారు. ఈ అంశాలకు తెలంగాణ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. క్రీ.శ. 1244లో కాకతీయ రాజు గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవులో జారీ చేసిన అభయ శాసనాన్ని ప్రస్తావిస్తూ, వాణిజ్యానికి అనుకూలమైన విధానాల ప్రాముఖ్యతను వివరించారు.

telangana rising curtain riser delhi

తెలంగాణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లు

రాష్ట్ర ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని గోయల్ సూచించారు. అధిక ఎగుమతి సామర్థ్యమున్న 50 ఉత్పత్తులు, సేవలను గుర్తించి అంతర్జాతీయ మార్కెట్లలో వాటి అవకాశాలను విస్తరించాలన్నారు. భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన ఉత్పత్తులకు నాణ్యమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్, ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని చెప్పారు.

ఫార్మా, ఏఐ, ఏరోస్పేస్ రంగాలపై దృష్టి

తెలంగాణ ఫార్మా పరిశ్రమ జనరిక్ ఔషధాల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, బ్రాండెడ్ ఔషధాలు, వినూత్న మందులు, బయోసిమిలర్ల తయారీపై దృష్టి పెట్టాలని గోయల్ సూచించారు. అంతరిక్షం, విమానయానం, విమాన విడిభాగాల తయారీ, నిర్వహణ-మరమ్మతు సేవలు (ఎంఆర్‌ఓ), రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, మెషీన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని అన్నారు.

కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో అభివృద్ధి

జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధిని ప్రస్తావించిన గోయల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ప్రపంచ స్థాయి పారిశ్రామిక నాయకత్వం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి పెట్టుబడి, ఎగుమతి, కొత్త ఉద్యోగం, స్టార్టప్ దేశాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణలో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *