(హైదరాబాద్,న్యూస్ఇన్)
విద్యార్థుల భద్రత, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు, విద్యార్థి మృతి ఘటనను సకాలంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంపై తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. వరంగల్ జిల్లా పార్కల్–ఓగ్లాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, హౌస్‌మాస్టర్‌పై ఈ చర్యలు తీసుకుంది. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సొసైటీ కార్యదర్శి రవి గుగులోతు స్పష్టం చేశారు.
కార్తిక్ మృతి ఘటనపై విచారణ…
పార్కల్ గురుకులంలో బీపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి. కార్తిక్ ఈ నెల 24న మృతి చెందాడు. ఈ ఘటనపై చేపట్టిన విచారణ, జోనల్ అధికారి సమర్పించిన నివేదిక, సంబంధిత సిబ్బంది వివరణలను పరిశీలించిన అనంతరం కార్యదర్శి చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థి మృతికి సంబంధించిన పరిణామాలతో పాటు, మరికొన్ని సున్నితమైన అంశాలను ఉన్నతాధికారులకు సకాలంలో తెలియజేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు.
ప్రిన్సిపాల్, హౌస్‌మాస్టర్‌పై వేటు….
ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్. ఆనందరావు విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించడంలో విఫలమైనట్లు విచారణలో గుర్తించారు. విద్యార్థుల కార్యకలాపాలపై సరైన నిఘా లేకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఘటనల సమాచారాన్ని ఆలస్యంగా నివేదించడం వంటి అంశాల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారు.

అదే విధంగా హౌస్‌మాస్టర్, జూనియర్ లెక్చరర్ (బోటనీ) ఆర్.వి. శంకర్‌పైనా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించడం, అవసరమైన కౌన్సెలింగ్ అందించడం, అసాధారణ పరిస్థితులను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయడంలో ఆయన విఫలమైనట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆయనను కూడా సస్పెండ్ చేశారు.
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు….
విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఏ ఘటననైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కార్యదర్శి స్పష్టం చేశారు. సమాచారాన్ని ఆలస్యంగా అందించడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం, బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. గురుకులాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, మానసిక సంక్షేమానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.













Leave a Reply