పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, రాబోయే రోజుల్లో మరో 20 కోట్ల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓటు హక్కును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
రాజ్యాంగ హక్కులపై దాడి…
ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ బహిరంగ సభకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు సాధించి ఉంటే రాజ్యాంగాన్ని మార్చడంతోపాటు రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రయత్నించేదని ఆరోపించారు. ప్రజలు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఓటర్ల జాబితాల సవరణ పేరుతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు.

ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు….
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను అడ్డుపెట్టుకొని ఓటర్ల పేర్ల తొలగింపు జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 15 నుంచి 20 శాతం ఓట్లను తొలగించాలన్న ప్రయత్నం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితాలను ప్రభావితం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉంటుందని, ఆ హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
రైళ్లు అడ్డుకున్నా ఢిల్లీకి వచ్చారు…
తెలంగాణ నుంచి 15 వేల మంది కార్యకర్తలను ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేక రైళ్లను కోరగా చివరి సమయంలో అనుమతి నిరాకరించారని సీఎం మండిపడ్డారు. అయినప్పటికీ వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు.కార్యకర్తల సంకల్పాన్ని మోదీ, అమిత్ షా అడ్డుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.

మోదీని గద్దె దించేవరకు పోరాటం….
రామాయణంలో రావణుడిని ఓడించేందుకు వానరసేన పోరాడినట్లే, నేడు కాంగ్రెస్ శ్రేణులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాయని రేవంత్ రెడ్డి అన్నారు. లక్ష్యం నెరవేరేవరకు విశ్రమించబోమని ప్రకటించారు.
రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఇచ్చే సందేశాన్ని గ్రామగ్రామానికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.అంతకుముందు తెలంగాణ భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి నేతలతో కలిసి రేవంత్ రెడ్డి రాంలీలా మైదానానికి తరలివెళ్లారు.