రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకు కార్యకర్తలమంతా పనిచేస్తాం
సంగారెడ్డి ప్రజలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం చూసిన జగ్గారెడ్డి
(మెదక్,న్యూస్ఇన్)
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్గారెడ్డి భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆయన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ర్యాలీ ప్రారంభం నుంచి బహిరంగ సభలో నేతల ప్రసంగాల వరకు తిలకించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ‘ఓట్ల చోరీ’కి పాల్పడిందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ఆయన సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాహుల్‌కు తోడుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు కదులుతున్నారని అన్నారు.

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరువలేనివని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో మాదిరిగా పేదలు సంతోషంగా జీవించే పాలన మళ్లీ రావాలని ఆకాంక్షించారు. యువత, మహిళలు, రైతులు సంతోషంగా ఉండాలన్నా, దేశ ప్రజలకు భద్రత కలగాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అన్నారు. ఆ లక్ష్యం నెరవేరేవరకు కార్యకర్తలు పోరాటాన్ని ఆపవద్దని పిలుపునిచ్చారు.
తన భార్య నిర్మలతో పాటు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ సభకు వెళ్లారని, తాను సంగారెడ్డిలో ప్రజలు, కార్యకర్తలతో కలిసి నేతల ప్రసంగాలను విన్నానని జగ్గారెడ్డి తెలిపారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ హృదయంలో శాశ్వత స్థానం ఉంటుందని , వారి సంక్షేమం కోసమే ఆయన పోరాడుతున్నారని పేర్కొన్నారు.