తాజా వార్త‌లుతెలంగాణారాజ‌కీయం

బహుజనుల బాణాన్ని.. యుద్ధ నినాదాన్ని: కవిత

(న్యూస్ఇన్‌, పాల‌మూరు)

బహుజనుల బాణాన్ని, యువత యుద్ధ నినాదాన్ని, అంబేడ్కర్‌వాదాన్ని, పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నాయకురాలినని క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని మోదీతోనూ పోరాడుతానని అన్నారు.

తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిందేనని కవిత పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన పాలనతో ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదన్నారు.

విద్య, వైద్యంపై హామీలు…..

తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం కోసం ప్రజలు సొంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ఎంత పెద్ద జబ్బు వచ్చినా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. యువత వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించేందుకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు.

రైతులకు సాగునీరు….

రైతులకు యూరియా, విద్యుత్, సాగునీరు, రైతు భరోసా, మద్దతు ధర విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జురాల నుంచి నీటిని ఎత్తిపోసి కొడంగల్, మక్తల్, నారాయణ్‌పేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ హామీని అమలు చేయలేకపోతే తన పేరు మార్చుకుంటానని ప్ర‌క‌టించారు.

సీఎం రేవంత్‌పై విమర్శలు….

కొడంగల్‌లో ఇందిరమ్మ ఇళ్లకు కూడా డబ్బులు అడుగుతున్నారంటూ కవిత ఆరోపించారు. నియోజకవర్గంలో తాగునీరు, విద్య, వ్యవసాయ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని విమర్శిస్తూ, బీసీలు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.2009లో ఇదే కోస్గీలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని కవిత గుర్తుచేశారు. వారిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారని, వచ్చే ఎన్నికల్లో తాను కూడా గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *