(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
మియాపూర్‌లోని సుమారు 550 ఎకరాల భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ భూముల విలువ సుమారు రూ.50 వేల కోట్లుగా పేర్కొన్న ఆయన.. వాటిని విక్రయించడం ద్వారా వచ్చే నిధులను విద్య, వైద్యం, సాగునీటి రంగాల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భూముల విక్రయంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
కేసీఆర్ కుటుంబంపై సీఎం ఆరోపణలు….
మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ప్రయత్నించారని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో దామోదర్ రావుకు విలాసవంతమైన కార్లు, కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు అందించారని విమర్శించారు. ఈ ఆరోపణలను ఆయన గత రాజకీయ పరిణామాలతో ముడిపెట్టారు. భూముల రక్షణ కోసం తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని తెలిపారు.
రూ.1.50 లక్షల కోట్ల భూములు రక్షించాం…
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించినట్లు సీఎం పేర్కొన్నారు. కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి, గుర్రంగూడ, మంచిరేవుల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో భూముల పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం భూముల విక్రయం, వాటి ద్వారా వచ్చే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేస్తుందని చెప్పారు.

అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్కు సవాల్...
భూముల ఆక్రమణల అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఈ వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని కేసీఆర్, కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మియాపూర్ భూముల విషయంలో ఇప్పటికైనా వివాదాలకు స్వస్తి పలకాలని సూచించారు. రెండు గ్రామాల మధ్య ఉన్న భూ వివాదాన్ని గతంలో కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారని ఆరోపిస్తూ, అక్కడి ఆక్రమణలను తొలగించి శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని ప్రకటించారు.












Leave a Reply