NewsInn

News in a Click

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సునీల్ టీం సర్వే… రేవంత్ వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సునీల్ టీం సర్వే… రేవంత్ వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్

(న్యూస్ఇన్, హైద‌రాబాద్)

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై చేస్తున్న వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి.. ఇలా పలు అంశాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సునీల్ కనుగోలు బృందానికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ముఖ్యంగా సీఎం వ్యాఖ్యలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎమ్మెల్యేల పనితీరు పట్ల నియోజకవర్గాల్లో సంతృప్తి ఉందా? అనే అంశాలను ఈ సర్వేలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎం వ్యాఖ్యలపై ప్రత్యేకంగా ఆరా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై చేస్తున్న రాజకీయ విమర్శలు పలుమార్లు వివాదాలకు దారితీశాయి. బహిరంగ సభలు, రాజకీయ సమావేశాల్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారాయి. ప్రతిపక్షాలను రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం ఒక ఎత్తయితే.. కొన్ని సందర్భాల్లో ఉపయోగించిన భాష, విమర్శల తీవ్రత మరో చర్చకు కారణమయ్యాయి.

cm revanth reddy

ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో సీఎం చేసిన వ్యాఖ్యల వీడియోలు, క్లిప్పింగులను వైరల్ చేస్తూ రాజకీయంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిణామాలను కాంగ్రెస్ నాయకత్వం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇటీవల ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నప్పటికీ, గతంలో మాదిరిగా వివాదాస్పద వ్యాఖ్యలకు కొంత దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సీఎం వ్యాఖ్యలపై ప్రజల స్పందన ఎలా ఉందనే అంశాన్ని సర్వే బృందం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల వారీగా సర్వే

ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరును కూడా ఈ సర్వేలో కీలకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేలా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు సమాచారం.

sunil kanugolu

ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు ప్రజల్లో ఉన్న ఆదరణకు, ప్రస్తుతం వారి పనితీరుకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రజలకు అందుబాటులో ఉండటం, నియోజకవర్గ అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి, స్థానిక నాయకులతో వారి సంబంధాలు, ప్రజలకు అందుబాటులో ఉండే తీరు కూడా సర్వేలో ప్రాధాన్యత పొందినట్లు తెలుస్తోంది.

సొంత పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారా ?

ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై సర్వే బృందం ప్రత్యేకంగా దృష్టి సారించిన మరో అంశం పార్టీలోని అంతర్గత సమన్వయం. నియోజకవర్గాల్లో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తున్నారు? అనే అంశాలపై కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ నేతలుగా ఉన్నప్పుడు వారి వ్యవహారశైలి ఎలా ఉంది? అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులుగా మారిన అనంతరం వారి పనితీరు, ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే అంశాలను పోల్చి చూస్తున్నట్లు సమాచారం.

నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత, నాయకుల మధ్య సమన్వయం, కేడర్‌తో ఎమ్మెల్యేల సంబంధాలు వంటి అంశాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయనున్నారు.

congress mlas

నవంబర్ నెలాఖ‌రు కు తుది నివేదిక ?

అన్ని నియోజకవర్గాల్లో సర్వే ప్రక్రియను నవంబర్ నెలాఖ‌రు నాటికి స‌ర్వే పూర్తి చేసి, సమగ్ర నివేదికను పార్టీ నాయకత్వానికి అందించాలనే లక్ష్యంతో సునీల్ కనుగోలు బృందం పనిచేస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనను పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం, ముఖ్యమంత్రి రాజకీయ వ్యాఖ్యల ప్రభావం, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ అంతర్గత పరిస్థితులపై సర్వే ఫలితాలు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

ఈ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పార్టీ, ప్రభుత్వ పరంగా ఎలాంటి మార్పులు చేపట్టాలి? ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *