(న్యూస్ఇన్,హైదరాబాద్)
బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన విలువైన ప్రభుత్వ భూమిని.. ఈ రోజు తాము అమ్ముకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావ్ ఎక్స్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మియాపూర్ 550 ఎకరాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సుప్రీంకోర్టు రికార్డులే స్పష్టం చేస్తున్నాయన్నారు.
మియాపూర్ భూ వివాదం 2003లోనే SLP గా సుప్రీంకోర్టుకు చేరింది. 2013లో అది సివిల్ అప్పీల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన భూమి ప్రభుత్వం చేజారిపోకూడదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృఢ నిశ్చయంతో వ్యవహరించారు. 2015లోనే దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్ ను ప్రత్యేకంగా నియమించారన్నారు. సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్ గారు 2015 ఏప్రిల్ 7 నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున మియాపూర్ భూముల రక్షణ కోసం సుప్రీంకోర్టులో వాదిస్తూ వచ్చారు. 2015 నుంచి 2023 వరకు దాదాపు 8 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేసిందన్నారు.
అంటే, మియాపూర్ తీర్పుకు అసలు పునాది ‘ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్’ కేసు తీర్పే. గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన ఆ కేసు 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ కేసులోనూ ప్రభుత్వం తరఫున వాదించింది అదే వైద్యనాథన్ గారు. నాడు మేము సాధించిన ఆ విజయమే, ఆ తీర్పులోని చట్టపరమైన అంశాలే నేడు మియాపూర్ భూముల తుది తీర్పుకు బలమైన ఆధారమయ్యాయి.
మియాపూర్‌లో ఉన్న ఈ 550 ఎకరాల భూమి విలువ రూ. 60 వేల కోట్ల పైమాటేనని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని, ఈ విలువైన భూములను అమ్ముకోవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.













Leave a Reply