బోటు ప్రమాదంలో తమిళ జాలర్ల మృతి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం
గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశం
(అమరావతి,న్యూస్ఇన్)
మురసు తుపాను అలజడిలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా బోటు ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బోటు ప్రమాదానికి గురైన సమయంలో 9 మంది మత్స్యకారులు అందులో ఉండగా, ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదని కలెక్టర్ వివరించారు.

గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకార బృందాల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం ప్రక్రియ త్వరగా పూర్తి చేసి వారి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తుపాను హెచ్చరికల సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సముద్రంలో అలజడులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియబరుస్తూ, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు.
