తాజా వార్త‌లుతెలంగాణాప్రజా సమస్యలు - ప్రభుత్వ పథకాలు

దీపావళి కానుక మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల్లో భారీ తగ్గింపు

రూ.8,500 ఉన్న నెలవారీ పాస్ ధర రూ.4,000కు తగ్గింపు

ప్రజలపై భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి పొన్నం

(న్యూస్ఇన్,హైద‌రాబాద్‌)

రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకగా ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

HYDERABAD METRO TRAIN

ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజు వారి ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్లు తెలిపారు. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుందని వివరించారు.

అదేవిధంగా ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు తగ్గించినట్లు తెలిపారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్టంగా 50 సింగిల్ ట్రిప్పులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు లేవని తెలిపారు.

ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుందని, సాధారణ ఉమ్మడి పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.

RTC BUSSES

నవంబర్ 8 నుంచి కొత్త ధరలు

ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు.

ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *